19 Interchanges in ORR Amaravathi

ఈనాడు, అమరావతి- 11APRIL: రాజధాని అమరావతి ప్రాంతం, గుంటూరు, విజయవాడల చుట్టూ నిర్మించనున్న అవుటర్ రింగ్ రోడ్ (ఓఆర్‌ఆర్)లో 19 చోట్ల ఇంటర్‌చేంజ్‌లు ఉండనున్నాయి. ఓఆర్‌ఆర్ యాక్సెస్ కంట్రోల్ గ్రీన్‌ఫీల్డ్ రోడ్ కావడంతో వాహనదారులు ఎక్కడపడితే అక్కడ ఓఆర్‌ఆర్‌లోకి ప్రవేశించేందుకు గానీ, అందులోంచి బయటకు వచ్చేందుకుగానీ అవకాశం ఉండదు. కొత్తగా నిర్మించే 19 ఇంటర్‌చేంజ్ జంక్షన్ల వద్ద మాత్రమే ఇందుకు వీలుంటుంది. ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, గుంటూరు, పల్నాడు జిల్లాల పరిధిలో 190 కి.మీ. ఓఆర్‌ఆర్ ఉంటుంది. ఇది ఎన్ని జాతీయ, రాష్ట్ర రహదారులను క్రాస్ చేస్తుందో ఆయా ప్రాంతాల్లో ఈ ఇంటర్‌చేంజ్‌లు నిర్మించేలా ప్రతిపాదించారు. ఇది కోల్‌కతా-చెన్నై హైవేని, మచిలీపట్నం-విజయవాడ-హైదరాబాద్ హైవేని రెండేసి చోట్ల క్రాస్ చేస్తుంది. తొలుత 17 ఇంటర్‌చేంజ్‌లనే జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) ప్రతిపాదించింది. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కోరడంతో మరో రెండింటిని పెంచారు. ప్రస్తుతం ఓఆర్‌ఆర్ డీపీఆర్ కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ పరిశీలనలో ఉంది. 2-3 నెలల్లో కేంద్రం ఆమోదం తెలిపే అవకాశం ఉంది.

ఇంటర్‌చేంజ్‌లు ఇవి..

🔴 ఇంటర్‌చేంజ్-1: విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిలో కంచికచర్ల సమీపం నుంచి ఓఆర్‌ఆర్ మొదలవుతుంది. ఇక్కడ తొలి ఇంటర్‌చేంజ్ నిర్మించనున్నారు.

🔴 2: ఓఆర్‌ఆర్‌లో 4వ కి.మీ. వద్ద పొన్నవరం సమీపంలో రెండో ఇంటర్‌చేంజ్ వస్తుంది. చెవిటికల్లు నుంచి కంచికచర్ల, జుజ్జూరు మీదుగా ఎర్రుపాలెం వైపు వెళ్లే రాష్ట్ర రహదారి ఓఆర్‌ఆర్‌లో 4వ కి.మీ. వద్ద క్రాస్ చేస్తుంది.

🔴 3: విజయవాడ-ఖమ్మం-నాగ్‌పూర్ ఎకనమిక్ కారిడార్‌ను దుగ్గిరాలపాడు సమీపంలో ఓఆర్‌ఆర్ క్రాస్ చేసిన చోట ఇంటర్‌చేంజ్ నిర్మించనున్నారు. ఓఆర్‌ఆర్‌లో 18వ కి.మీ. వద్ద ఇది వస్తుంది.

🔴 4: విజయవాడ నుంచి భద్రాచలం, రాయ్‌పూర్, జబల్‌పూర్ మీదుగా ఉత్తరాఖండ్‌లోని సితార్‌గంజ్ వరకు వెళ్లే జాతీయ రహదారి మైలవరానికి దగ్గరలో ఓఆర్‌ఆర్‌ను 31వ కి.మీ. వద్ద క్రాస్ చేస్తుంది.

🔴 5: ఓఆర్‌ఆర్‌లో 42-43వ కి.మీ.లకు మధ్య ఐదో ఇంటర్‌చేంజ్ వస్తుంది. విజయవాడ నుంచి ఈదర, సీతారామపురం మీదుగా నూజివీడు వైపు వెళ్లే రాష్ట్ర రహదారి బొద్దనపల్లి సమీపంలో ఓఆర్‌ఆర్‌ను క్రాస్ చేస్తుండటంతో అక్కడ ఇంటర్‌చేంజ్ నిర్మిస్తారు.

🔴 6: ఓఆర్‌ఆర్‌లో 48వ కి.మీ. వద్ద ఆరో ఇంటర్‌చేంజ్ విజయవాడ నుంచి ఆగిరిపల్లి మీదుగా నూజివీడు వెళ్లే రాష్ట్ర రహదారిలో ఆగిరిపల్లి సమీపంలో ఓఆర్‌ఆర్ దాటుతుంది.

🔴 7: ఓఆర్‌ఆర్‌లో 66వ కి.మీ. వద్ద ఏడో ఇంటర్‌చేంజ్. కోల్‌కతా-చెన్నై జాతీయ రహదారిని పొట్టిపాడు వద్ద ఓఆర్‌ఆర్ క్రాస్ చేస్తుంది.

🔴 8: ఓఆర్‌ఆర్‌లో 72వ కి.మీ. వద్ద ఎనిమిదో ఇంటర్‌చేంజ్. గన్నవరం నుంచి ఉంగుటూరు, పుట్టగుంట మీదుగా హనుమాన్‌జంక్షన్ వెళ్లే రాష్ట్ర రహదారిని ఓఆర్‌ఆర్ వెన్నూతల వద్ద క్రాస్ చేస్తుంది.

🔴 9: ఓఆర్‌ఆర్‌లో 80-81వ కి.మీ. వద్ద తొమ్మిదో ఇంటర్‌చేంజ్. కంకిపాడు నుంచి మానికొండ, కలవపాముల మీదుగా గుడివాడ వెళ్లే రాష్ట్ర రహదారిని మానికొండ సమీపంలో ఓఆర్‌ఆర్ దాటుకొని వెళ్తుంది.

🔴 10: ఓఆర్‌ఆర్‌లో 86వ కి.మీ. వద్ద పదో ఇంటర్‌చేంజ్. మచిలీపట్నం-విజయవాడ హైవేని చలివేంద్రపాలెం-దావులూరు మధ్య ఓఆర్‌ఆర్ క్రాస్ చేస్తుంది.

🔴 11: ఓఆర్‌ఆర్‌లో 106వ కి.మీ. వద్ద 11వ ఇంటర్‌చేంజ్. గుంటూరు నుంచి కొలకలూరు, నందివెలుగు, అత్తోట మీదుగా తూములూరు వైపు వెళ్లే రాష్ట్ర రహదారిని నందివెలుగు వద్ద ఓఆర్‌ఆర్ క్రాస్ చేస్తుంది.

🔴 12: తెనాలి సమీపంలో ఓఆర్‌ఆర్ నుంచి కోల్‌కతా-చెన్నై హైవేలో కాజ వరకు 17.5 కి.మీ.ల స్పర్ రోడ్ నిర్మిస్తున్నారు. దీంతో ఈ స్పర్ రోడ్ మొదలయ్యేచోట ఓఆర్‌ఆర్‌లోని 110వ కి.మీ. వద్ద ఇంటర్‌చేంజ్ నిర్మిస్తారు.

🔴 13: ఓఆర్‌ఆర్‌లో నారాకోడూరు సమీపం నుంచి కోల్‌కతా-చెన్నై హైవేలో గుంటూరు శివారు బుడంపాడు వరకు 5.5 కి.మీ.ల మరో స్పర్ రోడ్ నిర్మించనున్నారు. ఓఆర్‌ఆర్‌లో 123వ కి.మీ. వద్ద ఈ స్పర్ రోడ్ మొదలుకానుండగా అక్కడ ఇంటర్‌చేంజ్ నిర్మిస్తారు.

🔴 14: ఓఆర్‌ఆర్‌లో 129వ కి.మీ. వద్ద 14వ ఇంటర్‌చేంజ్. కేకేఆర్ అండ్ కేఎస్‌ఆర్ ఇంజినీరింగ్ కళాశాలకు సమీపంలో వస్తుంది.

🔴 15: ఓఆర్‌ఆర్‌లో 135వ కి.మీ. వద్ద 15వ ఇంటర్‌చేంజ్. గుంటూరు నుంచి ప్రత్తిపాడు వెళ్లే రాష్ట్ర రహదారిని పుల్లడిగుంట వద్ద ఓఆర్‌ఆర్ క్రాస్ చేస్తుంది.

🔴 16: ఓఆర్‌ఆర్‌లో 140వ కి.మీ. వద్ద 16వ ఇంటర్‌చేంజ్. కోల్‌కతా-చెన్నై హైవేని గుంటూరు శివారు లింగాయపాలెం సమీపంలో ఓఆర్‌ఆర్ క్రాస్ చేస్తుంది.

🔴 17: ఓఆర్‌ఆర్‌లో 149వ కి.మీ. వద్ద 17వ ఇంటర్‌చేంజ్. అనంతపురం-గుంటూరు హైవే, కొండమోడు నుంచి పేరేచెర్ల హైవేలను మేడికొండూరు సమీపంలో ఓఆర్‌ఆర్ క్రాస్ చేస్తుంది.

🔴 18: ఓఆర్‌ఆర్‌లో 170-171 కి.మీ. మధ్య 18వ ఇంటర్‌చేంజ్. పెదకూరపాడు నుంచి అమరావతి వెళ్లే రాష్ట్ర రహదారిని బలుసుపాడు వద్ద ఓఆర్‌ఆర్ క్రాస్ చేస్తుంది.

🔴 19: కోల్‌కతా-చెన్నై హైవేలో కాజ వద్ద 19వ ఇంటర్‌చేంజ్. ఓఆర్‌ఆర్‌లో తెనాలి వైపు నుంచి వచ్చే స్పర్ రోడ్ కాజ వద్ద కోల్‌కతా-చెన్నై హైవేలో కలుస్తుంది. ఈ పాయింట్ వద్ద 19వ ఇంటర్‌చేంజ్ నిర్మించనున్నారు.

Blogs
What's New Trending

Related Blogs